బధ్రపరచినది అనుభవాలు

ఏ తీరుగ నను దయ చూచెదవో…..

……. అని ఈ మధ్య ఎక్కువ సార్లు పాడాల్సి వస్తోంది. అబ్బే రాములవారి మీద భక్తి వల్ల కాదు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక మాంద్యం వల్ల. ఈ మాంద్యం వల్ల గాలి వానలో చిక్కుకున్న రాబందుల్లా కంపెనీలు గిల గిల కొట్టుకుంటున్నాయి. ఎప్పుడు ఏ కంపెనీ వాడు ఏం ప్రకటిస్తాడో అని భయంతో ఎదురుచూడవలసిన పరిస్థితి. నా ప్రాజెక్ట్ కొనే కంపెనీ వాడు “తూచ్…..నా దగ్గర డబ్బుల్లేవోచ్” అని బాంబు పేలుస్తాడేమోనని దిగులు. ఇది చాలదన్నట్టు,  ఎవడెంత పనికొస్తాడో పరీక్షలు పెట్టి మరీ తెలుసుకుంటున్నారు. మా వాళ్ళేమో నేను బాగా రాశానంటే నేను బాగా రాశానని కీబోర్డ్లు  విరగ్గొట్టి మరీ చెప్పుకుంటున్నారు.

ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నన్ను కాపాడుతుందని  పాడుకుంటున్నా…..

వ్యాఖ్యానించండి

కర్ణాటాంధ్రులు

అది కొచ్చి లోని ఎం.జి. రోడ్డు, ఆదివారం సాయంత్రం 6 అవుతోంది. నేను మ్యాట్ని షో ముగించుకుని నా బస్సు కోసం రోడ్లో ఎదురుచూస్తున్నా, ఇంతలో లీలగా ఏదో శబ్దం వినిపించింది. ఆ….ఇంత రద్దీలో ఏదో వినిపించిందిలే అనుకుని, మళ్ళీ నా బస్సు గురించి చూడడం మొదలెట్టాను. ఈ సారి ఏవో తెలిసిన పదాలు చాలా నెమ్మదిగా వినిపించాయి. ఎవరబ్బా అనుకుంటూ మళ్ళీ వెదికాను. నా అదృష్టం కొద్దీ ఎవరో తెలుగువారు, పాపం ఊరికి కొత్తనుకుంటా ఎక్కవలసిన బస్సేదో తెలియక తికమక పడుతున్నారు. పక్కనున్న వాళ్ళను అడుగుతున్నారు కానీ….లాభం లేదు. 

కొచ్చి లోని సిటి బస్సుల గురించి ఇక్కడ రెండు ముక్కలు చెప్పితీరవలసిందే. ఏ బస్సు ఎక్కడికి వెళ్తుందో, ఆ పరమేశ్వరుడు కూడా చెప్పలేడు ఒకవేళ ఆయనకు కూడా నా లాగా మళయాళం చదవడం రాకపొతే. బస్సులు వెళ్ళే జాగాల పేర్లు ఇక్కడి బాషలో తప్ప వేరే బషలో రాయమని కంకణం తో పాటు  ఎర్ర లుంగీ కూడా కట్టుకు కూర్చున్నారు మళయాళీ చేటలు. నా మట్టుకైతే ఈ సమస్యకి కొన్ని కిటుకులు ఆలోచించి పెట్టుకున్నా. నేను తరుచూ వెళ్ళే ప్రదేశాల పేర్ల మళయాళీ అక్షరాలను బట్టీ పట్టేశా. మరింకేం వెళ్ళి ఆ తెలుగు మిత్రులకి వాళ్ళ బస్సు చూపించేశా. ఏదో గొప్ప పని చేసినంత ఆనందం కలిగింది.  

ఇంతలో నా బస్సు వచ్చింది. ఎక్కి కూర్చున్నా….కొంచెంసేపయ్యాక మళ్ళీ లీలగా తెలిసిన భాష వినబడుతోంది. ఈ సారి కన్నడిగుల వంతు. వీళ్ళదీ ఇంచుమించు అదే సమస్య. ఎక్కడ దిగాలో తెలియట్లేదు వీళ్ళకి. శ్రీ కృష్ణదేవరాయల వారి పౌరుణ్ణి గనక, వీళ్ళకి ఎక్కువ కష్టపడకుండానే వారి గమ్య స్థానం చూపించేశా. కర్ణాటాంధ్రులను ఇలా కలుసుకోవడం ఎంతో బాగుంది.

 

బ్లాగ్లోకమునకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు

వ్యాఖ్యానించండి

Follow

Get every new post delivered to your Inbox.